శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ బాలాత్రిపురసుందరిదేవి సమేత శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పెంట.జగన్నాథ శర్మ, అర్చకులు ఇప్పిలి.శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ముందుగా శివపార్వతుల ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఆలయ మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీకూర్మానాధ ఆలయ కార్యనిర్వహణ అధికారి వాసుదేవరావు, పాలకమండలి సభ్యులు కుసుమకుమారి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.