అత్యవసర సమయంలో రోగి ప్రాణాలకు ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లు మూలకు చేరాయి. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో నెలకొన్న తాజా పరిస్థితి చూస్తే రోగుల గుండెల్లో దడ పుట్టక తప్పదు. కాగితాల మీద వందల సంఖ్యలో వెంటిలేటర్లు కనిపిస్తున్నా.. ఆచరణలో పనిచేసేవి మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. రిమ్స్‌లో రికార్డుల ప్రకారం మొత్తం 373 వెంటిలేటర్లు ఉన్నా, ప్రస్తుతం పనిచేస్తున్నవి కేవలం 42 మాత్రమే. మరి మిగిలిన 331 వెంటిలేటర్లు ‘కండమ్’(కండెమనేషన్) చేయబడ్డాయి. అంటే అవి మరమ్మతులకు కూడా నోచుకోని స్థితిలో లేదా కాలం చెల్లిపోయి మూలన పడ్డాయని అర్థం. దాదాపు 88 శాతం జీవనధార పరికరాలు మూలనపడితే జిల్లా ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడిది?. పిడియాట్రిక్, అడల్ట్స్ వార్డుల్లో తరుచూ వెంటిలేటర్లు అవసరం ఉంటున్నాయి. కానీ ఆశించినస్థాయిలో వెంటిలేటర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.