చిత్తూరు జిల్లా గుడిపాల మండలం అనుపు గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (40) అనే వ్యక్తిపై పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో, చిత్తూరు పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శంకర రావు గురువారం తీర్పు వెల్లడించారు. ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించారు. తన కుమారుడితో కలిసి చదువుకునే 14 ఏళ్ల మైనర్ బాలికను మోసపూరిత మాటలతో నమ్మించి, పెళ్లి చేస్తానని ఆశ చూపి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గుడిపాల పోలీసులు 16-02-2022న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువవడంతో కోర్టు బాధితురాలికి రూ.4 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.