హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.30 లక్షలు మోసం చేశాడని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి సాయికిరణ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పరిచయమై, వివాహితుడైనప్పటికీ సన్నిహితంగా ఉంటూ రూ.30 లక్షలకు పైగా తీసుకున్నాడని తెలిపారు. ఆరు నెలల క్రితం మరో మహిళ పరిచయమయ్యాక తనను పట్టించుకోవడం మానేసి, ప్రశ్నించినప్పుడు దాడి చేసి చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. నార్సింగి పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడికి వత్తాసు పలికారని, అనంతరం విజయనగరం వెళ్లి ఉండగా సాయికిరణ్ సన్నిహితులు డబ్బులు తిరిగిస్తామని, కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆమె తెలిపారు. ఇప్పటికైనా నిందితుడిని అరెస్టు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.