అనకాపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి పర్యవేక్షణలో ఆదివారం అనకాపల్లిలోని ఫోర్ రోడ్ జంక్షన్, కొత్తూరు జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. వాహనాలు ఎక్కడ నిలిచిపోతున్నాయి, ఎక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారనే అంశాలను అధికారులు డిజిటల్ విజువల్స్ ద్వారా విశ్లేషించారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.