దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలోని ఏపీ ఎన్జీవో హోంలో జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా, పెన్షన్ కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల బస్సు పాసుల గడువు ముగిసినందున, కొత్త అక్రిడిటేషన్లు వచ్చే వరకు మరో నెల రోజులు గడువు పెంచాలని, రైల్వే పాసుల సదుపాయాన్ని పునరుద్ధరించాలని సమాచార శాఖ అధికారులను కోరినట్లు వెల్లడించారు.