విశాఖలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటును వైయస్సార్సీపీ స్వాగతిస్తున్నప్పటికీ, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ రాయితీలు, భూమి కేటాయిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగ కల్పనపై స్పష్టత ఇవ్వకపోవడం యువతను మోసం చేయడమేనని మండిపడ్డారు. గతంలో 1.80 లక్షల ఉద్యోగాల ప్రచారం చేసి, ఇప్పుడు ఆ ఊసే లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, నిరుద్యోగులకు మేలు చేసే ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు.