పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన మహిళ హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులే కారణమని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్ కుమార్ వెల్లడించారు. విజయనగరానికి చెందిన ఆళ్ల దేవి(35)తో పరిచయం ఏర్పడిన చినముషిడివాడకు చెందిన వనుము శ్రీనివాసరావు(42) ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. రైస్ పుల్లింగ్ వ్యాపారంలో మోసం కేసులో జైలుకెళ్లిన శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంకకు దేవి సాయం చేసిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చాక, శ్రీనివాసరావును రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాకు విడుదల చేస్తానని దేవి బెదిరించింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు, దేవిని ఇనుప కుర్చీతో కొట్టి, చాకుతో పొడిచి హత్య చేశాడు. మృతురాలి సోదరి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.