రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శాఖ నిర్లక్ష్యం కారణంగా మాతా-శిశు మరణాలు సంభవిస్తున్నాయని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆరోపించారు. నరసాపురం గ్రామానికి చెందిన కోటం బాపనమ్మ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన పర్యవేక్షణ లోపించి, ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందగా, ఆమె శిశువు కూడా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల, మానవ హక్కుల, మహిళా కమిషన్‌లు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశాయి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని కుంజా శ్రీను తెలిపారు.