ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ)లో ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు స్పందించారు. ఇప్పటివరకు తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వర్సిటీ పేరును దుర్వినియోగం చేసినా, ఉద్యోగుల ప్రమేయం ఉన్నా సహించబోమని హెచ్చరించారు. ఏయూలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.