కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ సమర్పించి, ఒకే ప్రధాని ఆధ్వర్యంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుందని, రైతులు, మధ్యతరగతి, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఈ బడ్జెట్‌లో వారికి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొరార్జీ దేశాయ్ రికార్డుల సరసన నిర్మలమ్మ నిలవడం గర్వకారణమని, ప్రధాని మోదీ దార్శనికతతో దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.