ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'వాకథాన్'లో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ర్యాలీ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని నివారించవచ్చని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.