ప్రేమ పేరుతో మోసం చేసి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా, పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. మండవల్లి మండలం లోకుమూడి గరువుకు చెందిన తమ్మిరెడ్డి వసంత (22) అనే విద్యార్థిని, తాడేపల్లిగూడెంకు చెందిన బండారు సురేశ్ తో పరిచయం ప్రేమగా మారింది. సురేశ్ ఆమె నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలని వసంత కోరగా, సురేశ్, అతని తల్లి సూర్యప్రభ తిరస్కరించి, అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనోవేదనకు గురైన వసంత, ఈ నెల 1న ఇంట్లో టీబీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ ఘటనపై వసంత సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్, సూర్యప్రభలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.