పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో తణుకు వై జంక్షన్ లోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లాడుతూ, సామాన్యుడి రవాణా అవసరాలకు ఇంధనం లభించక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని అన్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి రావడం వల్ల రవాణా రంగం, సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుని కృత్రిమ కొరతను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.