ఓ పరువునష్టం కేసు విచారణలో భాగంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. 90 ఏళ్ల వృద్ధురాలు మొండిపట్టుతో ఉండటంతో.. తదుపరి విచారణను 2046కు వాయిదా వేశారు. 2015లో మొదలైన ఈ కేసులో, 90 ఏళ్ల తరిణిబెన్, 57 ఏళ్ల ధ్వని దేశాయ్.. కొందరిపై రూ.20 కోట్ల పరువునష్టం దావా వేశారు. రాజీకి యత్నించాలని కోర్టు సూచించినా, వృద్ధురాలు పట్టువదల్లేదు. మంగళవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర జైన్, ఇలాంటి కేసుల వల్ల అత్యంత ప్రాధాన్యత ఉన్న కేసుల్ని చేపట్టలేకపోతున్నామని, సూపర్ సీనియర్ సిటిజన్ అయినంత మాత్రాన ప్రాధాన్యం ఇవ్వలేమని, 2046 తర్వాతే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే బుధవారం ఈ ఆదేశాలను రివర్స్ చేసి, జులై 15కి తదుపరి విచారణను వాయిదా వేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చారు.