ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట, కొలాంగూడ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు అడవులు, వ్యవసాయ క్షేత్రాల్లో లభించే బుడుం పండ్లను సేకరించి రోడ్డుకిరువైపులా విక్రయిస్తున్నారు. అలాగే గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సితాగొంది ఘాట్ ప్రాంతాల్లో చింతగూడ, కొలాంగూడకు చెందిన ఆదివాసీ గిరిజనులు బుడుం పండ్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే లభించే ఈ పండ్లను సేకరించి విక్రయించడం ద్వారా ఆదివాసీ కుటుంబాలకు కాలానుగుణంగా మంచి ఆదాయం, ఉపాధి లభిస్తోంది. రహదారుల వెంట విక్రయిస్తున్న బుడుం పండ్లను స్థానికులు, ప్రయాణికులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.