తెలంగాణలోని పలు జిల్లాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో, మూడో విడత గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం స్థానిక ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎక్కువమంది తమ పార్టీ సర్పంచులుగా ఉంటే తమ పట్టు పెరుగుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం ఎమ్మెల్యేలకు సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను అప్పగించింది.