దేశంలో ఇటీవల పెరిగిన చక్కెర ధరలను నియంత్రించేందుకు, కృత్రిమ కొరతను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులకు ఉన్న చక్కెర నిల్వల గరిష్ఠ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. కొనుగోలు చేసిన చక్కెరను 30 రోజులకు మించి నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధన సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ చర్యల ద్వారా మార్కెట్‌లో చక్కెర లభ్యత పెరిగి, ధరలు అదుపులోకి వస్తాయని కేంద్రం ఆశిస్తోంది.