పిల్లలకు పేరెంట్స్‌తో అన్ని విషయాలు పంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి : సాయి దుర్గ తేజ్

12913చూసినవారు
పిల్లలకు పేరెంట్స్‌తో అన్ని విషయాలు పంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి : సాయి దుర్గ తేజ్
పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేకంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), యంగ్ ఇండియన్స్ (YI), భారత్ రైజింగ్ సంయుక్తంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సమ్మిట్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. పిల్లలను సోషల్ మీడియాలో వేధింపుల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. పిల్లల పట్ల అనుచిత వ్యాఖ్యలు, డార్క్ కామెడీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ బాధ్యతను తాను తీసుకుంటానని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వారితో అన్ని విషయాలు పంచుకునేలా స్వేచ్ఛను ఇవ్వాలని సూచించారు. తాను తన రెండో తరగతిలోని ప్రేమకథను కూడా తన తల్లితో పంచుకున్నానని, ఆ స్వేచ్ఛను ఆమె తనకు ఇచ్చారని తెలిపారు.అలాగే, పిల్లలకు 'గుడ్ టచ్', 'బ్యాడ్ టచ్' గురించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు. పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులకు తెలిసేలా సోషల్ మీడియా ఐడీలను వారి ఫోన్ నంబర్లు లేదా ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. తాను అరకులో పిల్లల చదువు కోసం స్కూల్ నిర్మించానని, తెలంగాణలో కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి చదువు, పోషణ చూసుకుంటున్నానని చెప్పారు. తన సినిమాల్లోని టీజింగ్ పాటలను ‘విన్నర్’ చిత్రం తర్వాత ఆపేశానని వెల్లడించారు. చివరగా, తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఆ విషయంపై తానే స్వయంగా ప్రకటన చేస్తానని సరదాగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్స్ కో-చైర్మన్ భవిన్ పాండ్య, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్