ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు, వ్యాపార నష్టాలు వంటి సమస్యలతో సతమతమవుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఆన్‌లైన్ జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి, ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. సంప్రదించిన వారి నుంచి ముందుగా తక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేసి, ఆ తర్వాత దోష నివారణ పేరుతో విడతల వారీగా లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని వారిని వ్యక్తిగత వివరాలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.