TG: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామకు చెందిన దేవన్న అనే మేకల కాపరి, కుమార్తె పెళ్లి జరిగిన రోజు రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లి ఖర్చుల కోసం తన వద్ద ఉన్న మేకల్లో కొంత భాగం అమ్ముకోవాల్సి రావడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం. పెళ్లి అనంతరం ఇంటికి చేరుకున్న దేవన్న, ఆవరణలో మేకల సంఖ్య తగ్గిన దృశ్యం చూసి కలత చెందాడు. అనంతరం ఆదివారం రాత్రి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొద్ది సేపటికే వధూవరులు ఇంటికి చేరుకోగా ఈ ఘటన బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.