
ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు. అయితే, ఈ మరణాలు స్క్రబ్ టైఫస్ వల్లే సంభవించాయో లేదో నిర్ధారణ కాలేదని, దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. మంగళవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని పేర్కొన్నారు. కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణలో 309 కేసులు నమోదయ్యాయి.




