తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఈవీలకు ఛార్జింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 35 పీఏసీఎస్‌ల పరిధిలోని గ్రామాలను ఎంపిక చేసి, వచ్చే నెల నుంచే ఈ సేవలు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడం, రైతులు, యువతలో ఈవీల వాడకంపై ఆసక్తి పెంచడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు.