షాదీ ముబారక్ పథకంలో 21 లక్షల మోసం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురి అరెస్ట్

2చూసినవారు
షాదీ ముబారక్ పథకంలో 21 లక్షల మోసం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో షాదీ ముబారక్ పథకంలో భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల రూపాయల మేర మోసం చేసిన ముఠాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అశోక్ కిరణ్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. మహమ్మద్ ఎతిమాద్ అనే వ్యక్తి తన సహచరులతో కలిసి ఫోటోషాప్, పెయింట్ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో వధువుల ఫోటోలు, ఆధార్ వివరాలు, వివాహ ధ్రువపత్రాలు తదితర పత్రాలను నకిలీగా తయారు చేసి, షాదీ ముబారక్ పథకం కింద సమర్పించి ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందేందుకు ప్రయత్నించారు. స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అశోక్ కిరణ్ సహకారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే దరఖాస్తులు తదుపరి ప్రక్రియకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నివాసంలో సోదాల్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లు, నకిలీ దరఖాస్తులు, ఐడీ ప్రూఫ్‌లు, సుమారు రూ.21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్