హయత్నగర్‌లో ఐటీ ఉద్యోగుల పేరుతో నడుస్తున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ స్టేటస్క్ ఫోర్స్ బృందం బట్టబయలు చేసింది. ఈ కేసులో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి, 7.44 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన అంజద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించేందుకు హేమంత్ అనే మరో ఐటీ ఉద్యోగి పెట్టుబడి పెట్టగా, వాటిని హరీష్ అనే వ్యక్తి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన సమయంలో టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది. బెంగళూరులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఎండీఎంఏను హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులను హయత్నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు బీ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.