సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేర్లు చెప్పి, ఏఐ సాయంతో నకిలీ వీడియోలు పంపి, రిటైర్డ్ డాక్టర్ కృష్ణయ్య (70)ను రూ.10.11 లక్షలు మోసం చేశారు. అయన ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉచితంగా టెస్లా కారు, బంగారం, నగదు ఇస్తామని నమ్మించి, కస్టమ్స్ క్లియరెన్స్, డెలివరీ ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. కుటుంబ సభ్యుల హెచ్చరికలను పట్టించుకోని డాక్టర్‌ను, చివరికి వారి అప్రమత్తతే కాపాడింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.