ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామంలో ఆదివారం గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర మహిళలు అందంగా అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని, నూతన చీరలు ధరించి, డప్పు వాయిద్యాలు, యువకుల, శివ సత్తుల నృత్యాలతో గ్రామ శివారులోని గంగమ్మ తల్లి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆలయం వద్ద ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పిల్లలు, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు.