ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రేషన్ కార్డు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత నిర్ధారణలో ఇది కీలకంగా ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.