ఉద్యమాల గడ్డ హుజురాబాద్, ప్రభుత్వం చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్ణయంతో కాష్టాల గడ్డగా మారే ప్రమాదం ఉందని రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న నిరవధిక దీక్షకు రజక సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నిరసన దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. నివాస ప్రాంతాలకు చేరువలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగి, భయంకరమైన రోగాలు ప్రబలే అవకాశం ఉందని, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అస్తవ్యస్తమవుతాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.