ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండల కేంద్ర పీహెచ్‌సీలో ఆదివారం ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమని, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, అపోహలు నమ్మకుండా ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటించి పోలియో రహిత మండలంగా నిలపాలని కోరారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు.