హుజూరాబాద్ మండలంలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ఓ రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పూర్తిగా దగ్ధమైంది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ అనే రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో దాదాపు 45 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పొరుగు పొలాల్లోని వరికొయ్యలను తగులబెట్టడంతో, ఎండ తీవ్రత, గాలి కారణంగా మంటలు వ్యాపించి ఈ విషాదం చోటుచేసుకుంది. అధికారులు వరికొయ్యలను తగులబెట్టవద్దని హెచ్చరిస్తున్నా కొందరు రైతుల నిర్లక్ష్యం తోటి రైతులకు నష్టం కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో మరిన్ని నష్టాలు తప్పాయి.