తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితుల మేరకు ఈ సవరణలు చేపట్టామని, నిపుణుల సూచనలు, అధికారుల సలహాలతో నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, భూముల డిమాండ్, మార్కెట్ పరిస్థితులు, ORR, RRR, కొత్త రోడ్లు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణను ప్రమాణాలుగా తీసుకున్నారు. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస రేట్లు ఖరారు చేశారు. 2021 తర్వాత నిర్మాణ వ్యయాలు సవరించడంతో కొత్త ధరల అవసరం ఏర్పడిందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో సవరణలు చేపట్టామని మంత్రి వివరించారు.