భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. మండల అధ్యక్షుడు దొడ్డ రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి కుతంత్రాలకు తెరలేపారని, రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ ను వేధించేందుకు సిట్ నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ జాతిపితను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.