ఆసిఫాబాద్ జిల్లాలో కుల వివక్షకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, పేదల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ ప్రకటించారు. సంఘం 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రజా సంఘాల కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. 1998 అక్టోబర్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెవిపిఎస్ చేపట్టిన పాదయాత్రల ద్వారా గ్రామాల్లో 62 రకాల కుల వివక్ష రూపాలు వెలుగులోకి వచ్చాయని, ఈ ఉద్యమాల ఫలితంగా అసెంబ్లీలో చర్చ జరిగి 106 ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు, దళితుల స్మశాన వాటికలకు భూమి కేటాయింపులో సంఘం కృషి చేసిందని పేర్కొన్నారు.