మెదక్ పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా 20వ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి మెదక్ జిల్లా
విద్యార్థులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, స్థానికంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల
విద్యార్థులు సొంతంగా ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తోందని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి నిధులు కేటాయించకపోతే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.