నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంట్లపల్లి గ్రామశివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న రెండు డీసీఎంలను మూగజీవాల లోడ్తో వెళ్తున్న మరో డీసీఎం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, దాదాపు 200 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన చిట్టికొండ ఎల్లయ్య(35)తో పాటు ఆయన కుమారుడు మల్లేష్, మరికొందరు కలిసి రెండు డీసీఎంలలో గొర్రెలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేరే డీసీఎం వెనుక టైరు పంచర్ కావడంతో హైవేపై నిలిపి మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు డిండి ఎస్ఐ సిహెచ్. బాలకృష్ణ తెలిపారు.