ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. శనివారం గుర్రంపోడు పీహెచ్సీలో నిర్వహించిన శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెలాఖరు వరకు అన్ని పీహెచ్సీలలో అన్ని విభాగాల వైద్యులచే శిబిరాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా 150 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా, మెరుగైన వైద్యం అవసరమైన వారిని నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.