ఈ ఏడాది జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు దాదాపు 39 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో విడతల వారీగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు కింద 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది.