నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు రైతుల ఐక్యత, సహకారం, ప్రభుత్వ మద్దతుతో కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, గతంలో 4 లక్షల ఎకరాల్లో సాగైన బత్తాయి, వివిధ కారణాల వల్ల 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.