తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా అధ్యక్షుడు ఎస్.సాయికుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 3 నుండి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేపట్టిన విద్య సంస్థల బంద్‌కు పి.డి.ఎస్.యు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెజార్టీ కళాశాలలు స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్నాయని, వేలాది మంది విద్యార్థులు వీటిపై ఆధారపడి విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బకాయిలను తక్షణమే క్లియర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నోరు విప్పడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యపై వారికి ఉన్న ప్రేమను ఇది స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. సంవత్సరాల తరబడి బకాయిలు రాక కళాశాలలు మూసివేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.