తెలంగాణలో మహిళలకు పంపిణీ చేయనున్న ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల తయారీ సిరిసిల్లలో జోరుగా సాగుతోంది. జిల్లాలోని 130 మరమగ్గాల మ్యాక్స్ సొసైటీలకు కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇచ్చారు. గతేడాది పాలపిట్ట రంగు చీరలు పంపిణీ చేయగా.. ఈసారి ప్యారెట్ గ్రీన్ (చిలుక పచ్చ) రంగులో చీరలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబరులో ఉత్పత్తి పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నారు. ఈ ఆర్డర్లతో సుమారు 5 వేల మంది నేత కార్మికులు, 2 వేల మంది అనుబంధ కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుండగా.. మరో 5 వేల మందికి పరోక్షంగా పని దొరుకుతోంది.