
ప్రాణాలు కాపాడి.. లక్ష రూపాయలకు పైగా నగదు తిరిగి ఇచ్చిన పోలీసులు
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ పరిధిలోని జన్నారం మండలం, లోతోర్రె గ్రామానికి చెందిన కుర్సెంగా దేవరావు ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మూర్ఛతో పడిపోయారు. బ్లూకోర్టు హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు వెంటనే స్పందించి జన్నారం ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ చాకచక్యంగా వ్యవహరించి, ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా దేవరావును లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరావు పడి ఉన్న చోట పరిశీలించగా, అతని వద్ద రూ. 1,08,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సర్పంచ్ బోడ శంకర్ ఆధ్వర్యంలో, ఎస్ఐ దేవరావుకు ఆ డబ్బులను అందజేశారు. ఈ సంఘటనలో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకొని, అతని డబ్బులను తిరిగి అప్పగించిన జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్, హెచ్సి దేవన్న, హెచ్జి నీలయ్య లను ఉన్నతాధికారులు మంగళవారం అభినందించారు.































