జిల్లాలో ధాన్యం కొనుగోలు, అన్‌లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని సాత్ గావ్, నగర్ గ్రామాల్లోని రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. సాత్ గావ్ గ్రామంలోని శ్రీదుర్గా రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్, యంత్రాల సహాయంతో జరుగుతున్న ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్‌లోడ్ చేయవచ్చని ఆయన తెలిపారు.