పేద ప్రజల గుండెల్లోంచి మహాత్మగాంధీ పేరును తుడిచివేయాలనే కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను, తన కుటుంబం కూడా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలిపని చేశామని, ఈ పథకం ఎంతోమంది పేదల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పనిదినాలు పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే పథకాన్ని దెబ్బతీసి, పేదల పొట్ట కొట్టేందుకే కేంద్రం కొత్త చట్టంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశం శనివారం జిల్లా కేంద్రంలో జరిగింది.