జిల్లా ప్రజలు జనగణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు ప్రక్రియను తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన-2027, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జనగణన దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, జనాభా గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ విధానాలను రూపొందిస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని సరైన సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.