నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని, నిర్మల్ జిల్లా చరిత్రను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాలకు ప్రొటోకాల్ పాటిస్తూ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సంతకాల బోర్డు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.