
చల్లపల్లిలో పేలుడు ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి, గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్ అబ్దుల్లాతో పాటు ఇతర సిబ్బందికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందించాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




