రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరంలేదని, తడిచిన వరి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వారిగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆయన సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.