గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆమె, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు వంటి పథకాల ద్వారా ఎందరో లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.