నిజామాబాద్ జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల సంఖ్య వారం రోజుల్లోనే 232కు చేరింది. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఈ కేసులను నమోదు చేశారు. పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. వీరిని కోర్టులో హాజరుపరచగా రూ. 22 లక్షల 40వేల జరిమానా విధించారు. ఆరుగురికి వారం రోజుల జైలు శిక్ష కూడా పడింది. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహన ధ్రువపత్రాలను తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని సీపీ సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.